చండూరు, జనవరి 07 : చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో సీసీ రోడ్డుకు ఆనుకుని ఓ బావి ఉంది. ఆ బావిలో ఎప్పుడు నీళ్లు ఉండడంతో బావికి కొంచెంద దూరంలో ఉన్న ఎస్సీ కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరి మొత్తం జలమయం అవుతుంది. అంతేకాకుండా సీసీ రోడ్డు కింద పెద్ద రంధ్రం లాగా ఏర్పడడంతో అది ఎప్పుడు కూలుతుందోనని వాహనదారులు భయాందోళనకు గురైతున్నారు. అదేవిధంగా బోడంగిపర్తి నుండి మునుగోడుకు వెళ్లే బీటీ రోడ్డు ప్రక్కనే ఉన్న మరొక బావి సైతం ప్రమాదకరంగానే ఉంది. రోడ్డు క్రింది భాగంలో ఇక్కడ కూడా సోరిక పడడంతో చండూరు నుండి మునుగోడుకు వెళ్లే భారీ వాహనాలతో బీటీ రోడ్డు ఎప్పుడు కులుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పాటైనందున వారైనా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు.

Chandur : రోడ్డు పక్కనే బావులు.. ప్రమాదంలో ప్రయాణికులు