ముంబై: కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. (Doctor Dies By Suicide) డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల ప్రతీక్షా భూసారే, ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నది. ఈ ఏడాది మార్చి 27న రష్యాలో ఎంబీబీఎస్ చదివిన వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అయితే ఆదివారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని నిందిస్తూ ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. తనను అనుమానించడంతోపాటు మొబైల్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చెక్ చేసేవాడని, వరకట్నం కోసం డిమాండ్ చేస్తునట్లు ఆరోపించింది.
మరోవైపు వైద్యురాలి భర్తపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత ఆసుపత్రి ఏర్పాటు కోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని తన కుమార్తెపై నిరంతరం ఒత్తిడి తెచ్చాడని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వరకట్న మరణం, వైద్యురాలిని ఆత్మహత్యకు పురిగొల్పడం వంటి పలు సెక్షన్ల కింద ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా డాక్టర్ ఆత్మహత్య సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.