‘నాకు 50 రోజుల సమయమివ్వండి. పెద్ద నోట్ల రద్దులో నా తప్పు ఉన్నట్టు తేలితే, మీరు ఏ చౌరస్తాకి పిలిచినా వస్తా. దేశం విధించిన శిక్ష భరిస్తా.
– నవంబర్ 14, 2016న ప్రధాని మోదీ వ్యాఖ్యలివి.
PM Modi | ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా ఆరున్నరేండ్లు గడిచిపోయాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఓ పెద్ద తప్పిదమంటూ ఆర్థిక నిపుణులే తేల్చిచెప్పారు. అయినప్పటికీ, మోదీ.. మరో అనాలోచిత, అపరిపక్వ నిర్ణయాన్ని తీసుకొన్నారు. తానే గొప్పగా ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకొని సామాన్యులపై మరో బండేశారు. తాజా నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై మరో పెను దాడి జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు. దాదాపు 1.4 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇన్ని జరిగినప్పటికీ.. నల్లధనం బయటకు రాలేదు. ఉగ్రవాదం మరింతగా పేట్రేగిపోయింది. నకిలీ నోట్ల కట్టడి జరుగలేదు. నోట్లరద్దుతో కకావికలమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కుదురుకోనే లేదు. ఇంతలో రూ.2 వేల నోటును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్రం ప్రకటించడం ఆర్థిక వ్యవస్థకు మరో గాయాన్ని చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది. రూ.250 లక్షల కోట్ల విలువ గల జీడీపీ మన సొంతం. 94 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి స్థితిగతులు కలిగిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీసుకొనే నిర్ణయాలపట్ల ఆచితూచి వ్యవహరించాలి. ఇవేమీ పట్టించుకోని ప్రధాని మోదీ ‘నోట్ల రద్దు’ పేరిట క్లినికల్ తరహా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దానికి తాజా ఉదాహరణ రూ. 2 వేల నోటు రద్దు. ప్రభుత్వ నిర్ణయంతో.. అసలు జేబులో పెద్దనోటును పెట్టుకోవాలంటేనే ప్రజలు భయపడే స్థితికి చేరుకొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న అపరిపక్వ నిర్ణయాలతో కరెన్సీపై ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నదని నిపుణులు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న నగదు ఎప్పుడు చిత్తు కాగితంగా మారిపోతుందోనన్న భయంతో సామాన్యులు దినదినగండంగా బతుకుతున్నారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయితే, పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా మళ్లీ ఆ స్థాయి వృద్ధిరేటు ఇప్పటివరకూ నమోదు కాలేదంటే ఆ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2 వేల నోట్ల ఉపసంహరణ కూడా ప్రజల్ని, వ్యాపారాల్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. రియల్ ఎస్టేట్ తదితర రంగాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాలిలో దీపంలా మార్చిన దేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కూడా కష్టమేనని, ఇది ఇక్కడి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2 వేల నోట్ల ఉపసంహరణను కేంద్ర ప్రభుత్వ మరో వెర్రి చర్యగా పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఓటమిని దాచేందుకే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొన్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. ‘చలామణిలో ఉన్న నగదు పరిమాణం అవినీతి స్థాయితో ముడిపడి వుంటుందని ప్రధాని మోదీ నోట్ల రద్దు సమయంలో సెలవిచ్చారు. 2016లో 17.7 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణి, 2022 నాటికి రూ.30.18 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దీనర్థం అవినీతి పెరిగిందా?’ అని ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్నించారు.
2 వేల నోటు అవినీతికి ముగింపు పలుకుతుందని దాన్ని ప్రవేశపెట్టే సమయంలో చెప్పారని, దాన్ని ఉపసంహరించుకొనేది కూడా అవినీతికి ముగింపు చెప్పేందుకేనని కేంద్ర పెద్దలు చెప్పుకొస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందుకే దేశానికి చదువుకొన్న ప్రధాని ఉండాలని ఎద్దేవా చేశారు. తమ వద్ద ఉన్న నోట్లు ఎప్పుడు టాయిలెట్ పేపర్లుగా మారిపోతాయేమోననే భయాందోళనలో ఏ దేశం ప్రజలను నిరంతరంగా ఉంచదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారు? రూ.500 నోటును కూడా రద్దు చేస్తారా? స్మార్ట్ ఫోన్లు లేని 70 కోట్ల మంది భారతీయులు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారు? అని ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు. పుణెలో ఎన్సీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.