Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా..? ఇప్పటివరకు ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ).. ఇప్పుడు ఎన్డీయేలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో శరద్ పవార్ ఎన్సీపీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో తన పార్టీని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో కలపాలని శరద్ పవార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి అధికారంలో ఉంది. ఇందులో బీజేపీతోపాటు షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడి (ఎంవీయే)లో కాంగ్రెస్, ఉద్ధవ్ వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ సభ్యులుగా ఉన్నాయి.
అయితే, వరుస ఓటములు, మరోవైపు ఎంవీయేకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలోని ఎన్డీయేవైపు, మహాయుతి కూటమివైపు చూస్తున్నారు. ఉద్ధవ్ శివసేనకు సంబంధించి మీటింగ్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ పార్టీ ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఇదే పరిస్తితి శరద్ పవార్ ఎన్సీపీలో కూడా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తన పార్టీ మనుగడ కష్టమని భావించిన శరద్ పవార్.. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలోని నేతల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో ఆయన ఇప్పుడు ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల సమయంలోనే తన పార్టీని కాంగ్రెస్లో కలపాలని శరద్ పవార్ భావించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. అయితే, ఎన్నికల తర్వాత దీనిగురించి చర్చిద్దాం అని అప్పట్లో వాయిదావేశారు. తర్వాత మరోసారి శరద్ పవార్.. కాంగ్రెస్ పెద్దలతో విలీన ప్రతిపాదన తెచ్చారు. వారు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించారు. కానీ, వారు ఎన్సీపీ తమ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించారు. ఎన్సీపీ తమ పార్టీలో విలీనమైతే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించారు. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడం, ఎన్సీపీ నేతల నుంచి సరైన మద్దతు లేని కారణంగా కాంగ్రెస్లో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ఎప్పట్లాగే కలిసి ఎంవీయే కూటమిలో కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఎంవీయేలోని ఉద్ధవ్ శివసేన చీలిపోయింది. ఆ పార్టీ ఎంపీలు షిండే వర్గంలో చేరారు. దీంతో ప్రతిపక్ష ఎంవీయే కూటమి మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండటంకన్నా.. అధికార ఎన్డీయే కూటమిలో చేరడం మేలని ఎన్సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీలో కీలక నేతలైన సుప్రియా సూలే సహా మరికొందిరికి కీలక పదవులు ఇచ్చేందుకు కూడా ఎన్డీయే అంగీకరించందనే ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని ఎన్సీపీ నేతలు అంటున్నారు. తాము ఎన్డీయే వైపు చూడటం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎన్సీపీ.. ఎన్డీయేలో చేరితే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తప్పదు.