Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండే వర్గం. అయితే, ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏడుగురు ఎంపీలు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోపు వారంతా షిండే వర్గంలో చేరే అవకాశం ఉందని శివసేనకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే క్రిపాలు మానె వెల్లడించారు.
ఎంపీలతోపాటు థాక్రేకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంలో చేరొచ్చని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి ‘ఆపరేషన్ టైగర్’ అనే పేరు పెట్టారని, ఇది త్వరలోనే మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేయబోతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు వంటివి పూర్తయ్యాయన్నారు. ఈ ‘ఆపరేషన్ టైగర్’కు సంబంధించిన పరీక్ష పూర్తికాగా.. దీన్ని నిర్వహించే సర్జన్ ఏక్నాథ్ షిండే అని క్రిపాలు మానె అన్నారు. ఆదివారం ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన సమావేశానికి ఐదుగురు ఎంపీలు రాకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. సమావేశానికి హాజరైన ఇద్దరు ఎంపీలు ఇప్పటికే షిండేతో సంప్రదింపులు జరిపారన్నారు. త్వరలోనే ఏడుగురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ వర్గం నుంచి షిండే శివసేనలో చేరుతారని క్రిపాలు స్పష్టం చేశారు.
అయితే, ఇద్దరు ఎంపీలు దీనికి వ్యతిరేకత వ్యక్తం చేశారని, వారు కూడా భవిష్యత్లో తమ అభిప్రాయం మార్చుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన దాదాపు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. గతంలో థాక్రేతో కలిసి ఉన్న శివసేన నేత షిండే.. ఆ పార్టీలో చీలిక తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో గతంలో మహారాష్ట్ర సీఎంగా కూడా కొనసాగారు. ఇప్పుడు మరోసారి మిగిలిన ఉద్ధవ్ వర్గాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.