Karnataka High Court | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్ బుక్ (Facebook)పై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ (India)లో ఫేస్ బుక్ సేవలను నిలిపివేస్తాం అంటూ హెచ్చరించింది. ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కర్ణాటకకు చెందిన శైలేష్ కుమార్ (Sailesh kumar) పాతికేళ్లుగా సౌదీ అరేబియాలోని (Saudi) ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, ఫేస్ బుక్ లో సౌదీ రాజుపై అభ్యంతరకర పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ.. శైలేష్ ను 2019లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీ రాజుపై, ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్టు పెట్టిన నేరానికి జైలు శిక్ష విధించారు. తన పేరుతో నకిలీ ఖాతాను సృష్టించిన దుండగులు ఈ పని చేశారంటూ శైలేష్ ఎంత చెప్పినా అక్కడి అధికారులు వినిపించుకోలేదు. ఈ విషయం తెలిసి శైలేష్ భార్య కవిత మంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు శైలేష్ కుమార్ పేరుతో నకిలీ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఫేస్ బుక్ కు లేఖ రాశారు. పోలీసుల అభ్యర్థనకు ఫేస్ బుక్ స్పందించలేదు.
దీంతో 2021లో శైలేష్ భార్య కవిత కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ వేసింది. తన భర్త శైలేష్ సౌదీ అరేబియాలోని ఓ సంస్థలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపింది. 2019లో శైలేష్ కుమార్ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్సీకి అనుకూలంగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారని పిటిషన్ లో పేర్కొంది. అయితే ఆ తర్వాత ఎవరో ఆయన పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచి.. సౌదీ అరేబియా దేశంపై అభ్యంతరకర పోస్టులు చేశారని వివరించింది. ఈ విషయం తన భర్త ద్వారా తెలుసుకున్నట్లు తెలిపింది. వెంటనే తాను మంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పిటిషన్ లో వెల్లడించింది.
కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు విచారణకు సహకరిస్తూ.. అందుకు అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఫేస్ బుక్ ను ఆదేశించింది. లేనిపక్షంలో భారత్ లో ఫేస్ బుక్ సేవలను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మంగళూరు పోలీసులు కూడా సమగ్ర విచారణ చేపట్టి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
Also Read..
Tamanna-Vijay Varma | తమన్నాతో ప్రేమ విషయం అందుకే రహస్యంగా ఉంచా : విజయ్ వర్మ
Uttarakhand | మూడు రోజులుగా.. కుళ్లిన శవాల మధ్యే నవజాత శిశువు
Adipurush | ట్విట్టర్ ట్రెండింగ్ లో ‘ఆదిపురుష్’.. ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడణవీస్