భర్త కోసం చంటిబిడ్డతో అడవుల్లోకి భార్య
ఛత్తీస్‌గఢ్‌లో మూవీని తలపించే ఘటన
రాయ్‌పూర్, ఫిబ్రవరి 16: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే. అదే అబుజ్మాద్ అడవి. అలాంటి కారడవిలోకి ఓ ఇల్లాలు రెండున్నరేండ్ల బిడ్డతో ఒంటరిగా వెళ్లింది. ఎందుకో తెలుసా.. మావోయిస్టుల చేతుల్లో చిక్కుకొన్న భర్తను రక్షించుకొనేందుకు. సినిమాను తలపిస్తున్న ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకొన్నది. బిజాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు నిర్మాణ కంపెనీలో అశోక్ పవార్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇంద్రావతి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులను చేపడుతుండగా గత శుక్రవారం పవార్‌ను అతని సహాయకుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వాళ్లను విడిపించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన భర్తను ఎలాగైనా కాపాడుకొనేందుకు పవార్ భార్య సోనాలీ పవార్ నిర్ణయించుకొన్నారు. ఇద్దరు కూతుళ్లలో ఒకరిని కుటుంబసభ్యుల దగ్గర ఉంచి, చిన్న కుమార్తెతో పవార్‌ను వెతుక్కొంటూ నక్సలైట్లు ఉండే అబుజ్మాద్ అడవిలోకి వెళ్లారు. తన బిడ్డను చూసైనా మావోలు భర్తను వదిలిపెడుతారన్న చిన్న ఆశతో ఆమె అడవిలో నడకసాగించారు. అధికారుల గాలింపు చర్యలు తీవ్రమవ్వడంతో మనసు మార్చుకొన్న మావోలు కిడ్నాపైన వారిని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ విషయాన్ని అడవిలో ఉన్న సోనాలీకి అధికారులు తెలియజేశారు. భర్త కోసం ప్రాణాలకు తెగించి అడవుల్లోకి వెళ్లిన సోనాలీ సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.