హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహి త్య అకాడమీ పురసారం ప్రకటించారు. 2025వ సంవత్సరానికిగాను అవార్డు గ్రహీతల జాబితాను కేంద్ర సాహిత్య అకాడమీ సోమవారం ప్రకటించింది. కరోనా కాలంలో ఆయన రచించిన ‘అనిమేష’ దీర్ఘకవితా సంపుటిని వచన కవిత్వం విభాగంలో ఎంపికచేశా రు. కరోనా కాలపు కన్నీటి దృశ్యాలు, మనిషి ఎదురొన్న జీవన బీభత్సాన్ని ‘అనిమేష’లో అత్యంత ఆర్ద్రతతో సిధారెడ్డి ఆవిషరించారు. ‘ఒక బాధ కాదు, అది సమాజపు సామూహిక వేదన’ అని చాటారు. సిధారెడ్డికి అవార్డు దక్కడంపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పలువురు కవులు, రచయితలు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు.
31న అవార్డు ప్రదానం
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి గాను వివిధ సాహిత్య ప్రక్రియల్లో కలిపి మొత్తంగా 24మంది రచయితలను ఎంపిక చేసింది. ఇందుకోసం 2025లో 24 భాషల నుంచి రచనలను ఆహ్వానించింది. అందుకు సంబంధించి అవార్డుగ్రహీతల జాబితాను తాజాగా అకాడమీ ప్రకటించింది. 8 ఉత్తమ కవితా సంకలనాలు, 4 నవలలు, 6 కథా సంపుటాలు, 2 సాహిత్య వ్యాస సంకలనాలు, 1 సాహిత్య విమర్శ, ఆత్మకథ, జ్ఞాపకాల విభాగంలో 3 చొప్పున మొత్తంగా 24 మంది రచయితలకు పురస్కారాలు ప్రకటించింది. తెలు గు రాష్ర్టాల నుంచి నందిని సిధారెడ్డి ఒక్కరే ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు ప్రదానోత్సవాన్ని ఢిల్లీలో ఈ నెల 31న నిర్వహిస్తారు. ఒక్కో రచయితకు రూ.లక్ష నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తారు.
బాల్యం నుంచే సాహిత్య సృజన
నందిని సిధారెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో 1955 డిసెంబర్ 6న జన్మించారు. తండ్రిపేరు బాల్ సిధారెడ్డి, తల్లి రత్నమాల. భార్య మళ్లీశ్వరి. కూతురు వీక్షణ. తండ్రి బాల్ సిధారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగిన తండ్రి ప్రభావం నందిని సిధారెడ్డిపై పడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పద్య సాహిత్య సృజన చేశారు. బాల్య దశలోనే కొమురవెల్లి మల్లికార్జునస్వామిపై ‘మల్లికార్జున శతకం’ రాశారు. అది అచ్చుకాలేదు. తర్వాత తెలుగు ఉపాధ్యాయుడు అష్టకాల నరసింహస్వామి ప్రోత్సాహంతో వచన కవిత్వంపై దృష్టి మళ్లించారు. యాభై ఏండ్లుగా ఆయన సాహిత్య సృజనచేస్తూ సామాజిక సృ్పహతో వచన కవిత్వం రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సబ్జెక్టు లో ఎంఏ, ఎంఫీల్, పీహెచ్డీ చేసిన సిధారెడ్డి మెదక్, సిద్దిపేట డిగ్రీ ప్రభుత్వ కాలేజీల్లో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు.
మొదటి నుంచీ అభ్యుదయవాది
నందిని సిధారెడ్డి మొదటి నుంచీ అభ్యుదయ, విప్లవ భావజాలంతో సామాజిక నేపథ్యంలో కవిత్వం రాశారు. ఆయన కవిత్వం నిండా తెలంగాణ మట్టి వాసన, మానవీయ విలువలు పరిమళిస్తాయి. మొదటినుంచీ తె లంగాణ వాది. 1969 తెలంగాణ ఉద్యమం లో సైతం విద్యార్థిగా పాల్గొన్నారు. 1986లో మంజీర రచయితల సంఘం ప్రారంభించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అభ్యుదయ కవులను ఏకం చేశారు. 1996లోనే నందిని సిధారెడ్డి నేతృత్వంలో మంజీర రచయితల సం ఘం ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తూ తీర్మానంచేసి ప్రకటనచేసింది. 2001 లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. ఉద్యమాన్ని ప్రభావితం చేసిన పాటల్లో ఆయన రాసిన ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ పాట’ ఒకటి.
తొలి సాహిత్య అకాడమీ చైర్మన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. నందిని సిధారెడ్డిని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా నియమించి గౌరవించారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నందిని సిధారెడ్డి సమర్థంగా పనిచేశారు. అనేక పుస్తకాలను ప్రచురింపజేశారు. కేసీఆర్ సారథ్యంలో, నందిని సిధారెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో నాభవిష్యతి అన్న రీతిలో జరిగాయి.
కోటి నగదు తిరస్కరించిన సిధారెడ్డి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిధారెడ్డికి కోటి రూపాయల నగదు బహుమతి, 250 గజాల స్థలం ఇవ్వడానికి ప్రతిపాదన చేసింది. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడం, అధికారిక ముద్రలో తెలంగాణ చిహ్నాలను తొలగించడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
సిధారెడ్డి సాహితీ ప్రస్థానానికి దకిన గౌరవం: హరీశ్‌రావు
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడని కొనియాడారు. కేంద్ర సాహిత్య పురసారం సిధారెడ్డి సాహితీ ప్రస్థానానికి దకిన అసలైన గుర్తింపు, గౌరవమని అభివర్ణించారు. సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
సిధారెడ్డికి దేశపతి సన్మానం
అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ప్రముఖ జర్నలిస్ట్ విరాహత్ అలీ సిధారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి హర్షం
సిధారెడ్డికి అవార్డు దక్కడంపై తెలుగు రచయితలు, కవులు, సాహితీవేత్తలు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సిధారెడ్డి సాహిత్య సేవను కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మంజీర రచయితల సంఘం కూడా అభినందించింది.
తెలంగాణకు గర్వకారణం సిధారెడ్డి: కేసీఆర్
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 దక్కడంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. సిద్ధారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి.. అనిమేషకు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిధారెడ్డి అని ప్రశంసించారు. ఈ మేరకు కేసీఆర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంజీర రచయితల సంఘం ఏర్పాటుచేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట, సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ, ఉద్యమ కవిగా ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని పేర్కొన్నారు. సిధారెడ్డి సేవలను గుర్తించి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించి గౌరవించుకున్నదని కేసీఆర్ గుర్తుచేశారు.
నందిని సిధారెడ్డి రచనలు.. వరించిన పురస్కారాలు
సిధారెడ్డి అనేక రచనలు చేశారు. మొదట భూమిస్వప్నం అనే కవితా సంపుటిని 1985లో వెలువరించారు. ఆ తర్వాత సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధగాదు, నది పుట్టువడి, ఇగురం, ఆవర్తనం, నాగేటి సాల్లల్ల (తెలంగాణ పాటల పుస్తకం), ఇకడి చెట్ల గాలి, చిత్ర కన్ను, బందారం కథలు ( కథాసంపుటాలు), కరోనా నేపథ్యంలో ‘అనిమేష’ అనే దీర్ఘ కవితా సంపుటిని వెలువరించారు. ఇటీవలే ‘నాగటి తరం’ అనే నవలను కూడా రచించారు. ఆయన రచనలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.
తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన కవి సిధారెడ్డి: కేటీఆర్
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.ఆయన తన రచనల ద్వారా తెలంగాణ సాహిత్యానికే వన్నె తెచ్చారని కొనియాడారు. సిధారెడ్డికి వ్యక్తిగతంగా, పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.