లక్నో: ఒక మహిళ ఆమె ప్రియుడి మధ్య ఉన్న సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేసేందుకు ప్రియుడికి ఆమె సహకరించింది. సగం కాలిన వ్యక్తి మృతదేహంపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. (Woman Helped Lover Kill Husband) ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 1న ఆగ్రాలోని సయ్యాన్ ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు.
అయితే ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ముంజేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా హతుడి పేరు లోకేంద్ర అని తెలుసుకున్నారు. మరునాడు అతడి అదృశ్యంపై లోకేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేంద్ర ప్రజాపతితో కలిసి చివరిసారి అతడు కనిపించినట్లు పేర్కొన్నాడు.
కాగా, లోకేంద్ర హత్య కేసు ఛేదించేందుకు ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నేర స్థలం సమీపంలో పడి ఉన్న మద్యం సీసాలు, కొన్ని కాగితపు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఒక పండ్ల వ్యాపారి వినియోగదారుల కోసం ఆ కాగితపు ముక్కలు ఉపయోగిస్తాడని ఆ ప్రాంతంలోని షాపుల వ్యక్తులు పోలీసులకు చెప్పారు. మద్యం సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా నిందితులను గుర్తించారు.
మరోవైపు, తగినన్ని ఆధారాలు లభించడంతో లోకేంద్ర భార్య, మహేష్ ప్రజాపతి, అతడి స్నేహితుడు ధర్మవీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా లోకేంద్ర హత్యకు దారితీసిన రహస్యం వెలుగులోకి వచ్చింది. లోకేంద్ర భార్య, మహేష్ మధ్య చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉన్నది. ఇటీవల లోకేంద్రకు దీని గురించి తెలియడంతో తన భార్యను నిలదీశాడు. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేందుకు ప్రియుడు మహేష్, ఆమె కలిసి కుట్ర పన్నారు.
కాగా, ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లగా అతడి భార్య మహేష్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో దారిలో లోకేంద్రను అతడు కలిశాడు. మద్యం సేవించడానికి ఆహ్వానించాడు. మహేష్ స్నేహితుడు ధర్మవీర్ కూడా కలిశాడు. ఆ ముగ్గురు కలిసి మద్యం, ఫుడ్ కొనుగోలు చేసి పొలం వద్దకు చేరుకున్నారు.
అయితే మద్యం తాగిన తర్వాత మహేష్, ధర్మవీర్ కలిసి లోకేంద్ర గొంతు నొక్కారు. స్పృహ కోల్పోయిన అతడి శరీరంపై పెట్రోల్ పోశారు. గడ్డి కప్పి నిప్పంటించడంతో లోకేంద్ర మృతదేహం సగం కాలిందని పోలీస్ అధికారి తెలిపారు. ఆధారాల మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Man Kills 9 Month Old Son | భార్యతో గొడవ.. 9 నెలల కుమారుడ్ని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
Tempo Falls Into Gorge | లోయలో పడిన టెంపో.. నలుగురు పర్యాటకులు మృతి, 14 మందికి గాయాలు
Watch: పార్క్ చేసిన థార్ వాహనం వేగంగా వెనక్కి.. తర్వాత ఏం జరిగిందంటే?