న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై (Tamil Nadu Governor) సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపై మండిపడింది. బిల్లుల ఆమోదానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెండింగ్ బిల్లులపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్నది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ క్లియర్ చేయకపోవడంపై 2023లో తొలిసారి సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పది బిల్లులను పంపి వాటిని పెండింగ్లో ఉంచడంపై మండిపడింది.
కాగా, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన తాజా పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించింది. బిల్లును తిరిగి పంపేందుకు గవర్నర్ కారణాలు చెప్పకూడదా? అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి గవర్నర్ పంపవచ్చా? గవర్నర్ అన్ని రకాల బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చా? గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని నిర్ణయించవచ్చా? అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సిన అవసరం ఉందా? రాష్ట్రపతి నుంచి ఏమి ఆశించాలి? అని ప్రశ్నలు అడిగింది. శుక్రవారం నాటి విచారణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొంది.