Priyanka Gandhi : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఇవాళ లోక్సభ (Loksabha) లో ఈ గేయంపై చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రియాంకాగాంధీ ప్రభుత్వాన్ని పైవిధంగా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వందేమాతరంపై చర్చ చేపట్టడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయని ప్రియాంకాగాంధీ చెప్పారు. అందులో మొదటిది వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కాగా, రెండోది దేశ ప్రజల దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లకుండా గతంపైనే నిలిపి ఉంచడం కోసమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మంచి ప్రసంగం చేశారు కానీ, నిజాలు చెప్పడంలో ఆయన బలహీనంగా కనిపించారని అన్నారు.
అంతేగాక ‘మీరు ఎన్నికల కోసం పనిచేస్తుంటే మేం దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాం’ అని బీజేపీని ఉద్దేశించి ప్రియాంకాగాంధీ అన్నారు. మేం ఎన్ని ఎన్నికలు ఓడిపోయామనేది విషయం కాదని, మేం ప్రజల కోసం మీతో, మీ సిద్ధాంతాలతో పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దేశం కోసం మా పోరాటం కొనసాగుతుందని, మా పోరాటాన్ని మీరు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.