Devendra Fadnavis | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. సీఎం పదవికోసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే అంశంపై దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు. తుదపరి ముఖ్యమంత్రి ఎవరన్నది కూటమి నేతలు పరస్పర ఒప్పందం ద్వారా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం ఖాయమైన సందర్భంగా ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదం లేదని స్పష్టతనిచ్చారు. ‘ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదాలూ లేవు. ఎన్నికల ఫలితాల తర్వాత మహాయుతి కూటమిలోని మూడు మిత్రపక్షాల నేతలు కలిసి కూర్చొని దీనిపై నిర్ణయం తీసుకుంటారు’ అంటూ ఫడ్నవీస్ వివరించారు.
ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మహాయుతిని ఆదరించారని చెప్పుకొచ్చారు. తప్పుడు కథనాలు, మతం పేరుతో ఓట్లు అడిగిన మహా వికాస్ అఘాడీని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ‘ఏక్ హైత్ సేఫ్ హైన్..’ నినాదం తమను గెలిపించిందన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీవైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఫడ్నవీస్ వెల్లడించారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలపై ఫడ్నవీస్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ ఎన్నికల్లో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఒప్పుకుంటారా..? అని నిలదీశారు.
Also Read..
Maharashtra CM | షిండేనా.. ఫడ్నవీసా.. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..?
Devendra Fadnavis | ఒక్కరు ఉంటేనే భద్రంగా ఉంటుంది.. సీఎం గురించి చర్చ వేళ ఫడ్నవీస్ ఆసక్తికర ట్వీట్
Maharashtra CM | ఈనెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం..!