PM Modi on WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో తప్పనిసరిగా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. నిలకడగా అంతర్జాతీయ ఆరోగ్య భద్రతకు చేయూతనిచ్చేందుకు వీలుగా దాన్ని రూపొందించాలని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వోలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.
గురువారం సాయంత్రం కొవిడ్‌పై జరిగిన గ్లోబల్ వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలు కూడా మరింత అనువుగా ఉండాలని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్‌వో అనుమతులను క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. భవిష్యత్‌లో హెల్త్ ఎమర్జెన్సీలపై పోరాడేందుకు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరం అని అన్నారు.
భారత్ బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. తక్కువ ఖర్చుతో రూపుదిద్దుకున్న స్వదేశీ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేయడంలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు.