ముంబై: కేంద్ర సర్కారుపై ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) విమర్శలు గుప్పించారు. వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను దేశానికి రప్పించడం బీజేపీ సర్కారుకు చేతకావడంలేదని, అలాంటి వాళ్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఎలా తిరిగి తీసుకొస్తారని ప్రశ్నించారు.
నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామని గొప్పలు చెప్పిన మోదీ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని రౌత్ విమర్శించారు. బీజేపీ సర్కారులోని పెద్దలు పెద్దపెద్ద హామీలు గుప్పిస్తారని, కానీ ఆ హామీలతో సామన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడమే అధికార బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా ఎదుగుతుండటంతో ఆ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని, ఇప్పటికే మనీశ్ సిసోడియా, సంత్యందర్ జైన్లను జైలుకు పంపిన బీజేపీ ఇప్పుడు అరవింద్ కేజ్రివాల్‌ను టార్గెట్ చేసిందని రౌత్ ఆరోపించారు. ఎన్సీపీపై కూడా ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నదని, ఇది ఒక ప్రభుత్వమేనా..? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పార్టీని కాకుండా ఒక గ్యాంగ్‌ను నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు.