న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ విధానాలపై, ప్రధాని నరేంద్రమోదీ తీరుపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. మణిపూర్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలన్నీ కేంద్ర ప్రభుత్వ పుణ్యమేనని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆ ఈశాన్య రాష్ట్రంలో హింస రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ సర్కారు కోరిక మేరకు మణిపూర్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని అఖిలేష్ ఆరోపించారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీ గానీ, ఇతర బీజేపీ నేతలు గానీ లోక్సభలో చర్చకు సాహసించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని పార్లమెంటు మెట్లపై మోకరిల్లినప్పుడే ప్రజలు దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతున్నదని నమ్ముతారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం మణిపూర్లో హింసను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. మణిపూర్ అంశంపై లోక్సభలో చర్చను ఎదుర్కొనే సత్తా ప్రస్తుత ప్రభుత్వానికి లేనేలేదని ఆయన ఎద్దేవా చేశారు.