Wheat Prices | పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో వంటనూనెల ధరలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా గోధుమ పిండి ధరలు సైతం పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని వారాలుగా గోధుమ పిండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గోధుమల సరఫరా తగ్గడమేనని తెలుస్తున్నది. హోల్సేల్ మార్కెట్లో పిండి ధరలు కనీసం 20శాతం వరకు పెరిగాయి. ధరల నుంచి ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గోధుమల నిల్వ పరిమితిని సవరించింది. త్వరలోనే దసరా, దీపావళి పండగలకు ముందు పిండి ధరల పెరుగుదల సామాన్యులకు కష్టాలు పెంచుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లో పిండి ధర క్వింటాల్కి రూ.2250 నుంచి రూ.2800 వరకు పెరిగింది.
పిండి పెరుగుదల నేపథ్యంలో బ్రెడ్, మఫిన్స్, నూడుల్స్, పాస్తా, బిస్కెట్స్, కేక్, కుకీలు తదితర ఉత్పత్తుల ధరలపై సైతం ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిండి ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా గోధుమల నిలువలు సరిపడా ఉన్నాయని పేర్కొంది. అతే కాకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, చైన్ రిటైలర్స్, ప్రాసెసర్స్కు వర్తించే గోధుమల స్టాక్ పరిమితిని సవరించింది. 2024 రబీలో 1129 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించారు. గోధుమ నిల్వ పరిమితి పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం అన్ని గోధుమలను నిల్వ చేసే సంస్థలను కోరింది. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొంది. ఆయా స్టాక్ వివరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు పర్యవేక్షించనున్నారు.