The Resistance Front | మంగళవారం మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే (Pahalgam Terror Attack). అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనే అని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front) ప్రకటించింది. దీంతో టీఆర్ఎఫ్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రసంస్థ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టీఆర్ఎఫ్.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది ఆవిర్భవించింది. కశ్మీర్‌కు 2019 ఆగస్టులో ప్రత్యేక హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా టీఆర్ఎఫ్ పనిచేస్తుంది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాద కమాండర్లు ఈ సంస్థను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఎల్ఈటీకి అనుబంధంగా టీఆర్ఎఫ్ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.
సాజిద్ జాట్, సజ్జద్ గుల్, సలీమ్ రెహ్మని లాంటి వారు దీంట్లో నేతలుగా ఉన్నారు. వీళ్లంతా ఒకప్పుడు లష్కరే తీవ్రవాదులు. లష్కరేతో పాటు ఇతర ఉగ్ర గూపుల నుంచి దృష్టి మళ్లించేందుకు తాజా దాడుల్ని తాము చేస్తున్నట్లు టీఆర్ఎఫ్ చెప్పుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్‌మీడియా ద్వారా సైకలాజికల్ మైండ్ గేమ్ పోస్టులు, వీడియోలతో యువతను ప్రభావితం చేయడం టీఆర్ఎఫ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. అలా బ్రెయిన్ వాష్ అయిన యువతతో ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తూ.. ఉగ్ర దాడులకు స్కెచ్ వేయడం టీఆర్ఎఫ్ పని.
కశ్మీర్లో ఉగ్రదాడులతో పాటు కశ్మీరీ పండిట్ల హత్య కేసుల్లో టీఆర్ఎఫ్ హస్తం ఉంది. 2020 జనవరి నుంచి కశ్మీర్లో జరుగుతున్న దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ చెబుతోంది. 2024 అక్టోబర్‌లో గండేర్బాల్ జిల్లాలో, కుప్వారాలో 2020లో, 2023 అనంత్‌నాగ్ సహా పలుచోట్ల టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. అంతేకాదు కశ్మీర్ లోయలో జరుగుతున్న దాడుల వెనుక టీఆర్ఎఫ్ హస్తం ఉంది. మరోవైపు టీఆర్ఎఫ్ ఇప్పుడు యాక్టివ్ గ్రూపుగా మారినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కూడా.
ఆన్లైన్ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది. పాక్ నుంచి ఆయుధాలు, నార్కోటిక్స్ సరఫరా కోసం ఆ యువతను వాడుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థల వైపు జమ్ము కశ్మీర్ ప్రజల్ని ఆకర్షించేందుకు.. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎఫ్ సైకలాజికల్ ఆపరేషన్స్ చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ వరుస ఊచకోతలకు పాల్పడుతుండటంతో.. 2023 జనవరిలో ఉగ్రసంస్థను కేంద్రం నిషేధించింది.
Also Read..
TRF | పెహల్గామ్ దాడి మా పని కాదు.. మా వ్యవస్థల్ని భారత్ హ్యాక్ చేసింది.. ఉగ్రసంస్థ సంచలన ప్రకటన
Pahalgam Attack | కశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా దళాలు