TRF | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (The Resistance Front) సంచలన ప్రకటన చేసింది. మొదట ఈ దాడి తమ పనే అని ప్రకటించుకున్న ఆర్టీఎఫ్ (TRF).. ఇప్పుడు మాట మార్చింది. పెహల్గామ్లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.
తమ వ్యవస్థలి భారత్ హ్యాక్ చేసినట్లు ప్రకటనలో ఆరోపించింది. ‘పెహల్గామ్ ఘటనలో మా ప్రమేయం లేదు. ఈ చర్యను టీఆర్ఎఫ్కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు సంబంధం లేదు. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసింది. ఇది భారత సైబర్-ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ల పని. దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు’ అంటూ ఆరోపించింది.
మంగళవారం మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనే అని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇప్పుడు మాత్రం మాట మారుస్తూ.. భారత్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం.
Also Read..
Pahalgam Attack | కశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా దళాలు