ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(PM Shehbaz Sharif) స్పందించారు. మిలిటరీ పరేడ్ పాసింగ్ ఔట్ సెర్మనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తటస్థంగా, పాదర్శకంగా పెహల్గామ్ ఘటనపై విచారణ చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. అంతర్జాతీయ ప్రవర్తన, సహకారానికి తగినట్లు కట్టుబడి ఉన్నామన్నారు. మానవ ఐకమత్యాన్ని తమ దేశం నమ్ముతుందన్నారు. జాతి ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా విశ్వ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు.
పాకిస్థాన్ శాంతి వైపు నిలబడుతుందని, అయితే తమ ఆశయాన్ని బలహీనంగా తీసుకోవద్దు అని తెలిపారు. దేశ ఔనత్యం, భద్రత అంశంలో వెనుకడుగు వేయబోమన్నారు. సింధూ జలాల మళ్లింపు అంశంపై మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నీరు చాలా ముఖ్యమైందని, అది పాకిస్తాన్ జాతీయ ప్రయోజనమన్నారు. సింధూ జలాలు సుమారు 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవాధారం అన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం వద్దు అని, ఆ నీరు అందరికీ అందేలా రక్షణాత్మక చర్యలు తీసుకుంటామని, అది ఎటువంటి పరిస్థితైనా చర్యలు తప్పవని పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు.
సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి , నీరును దారి మళ్లించినా లేక ఆపేసినా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రధాని షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. నీటిపై జోక్యం చేసుకుంటే దానికి గట్టిగా బదులిస్తామన్నారు. ఈ అంశంలో ఎవరూ భ్రమపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్థాన్‌ను నిందించే ప్రక్రియను భారత్ మానుకోవాలన్నారు.