e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?

మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?

రుతుప‌వ‌నాలు వ‌చ్చేశాయి. ఈసారి వ‌ర్షాలు కూడా బాగానే కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం కూడా మొత్తం చ‌ల్ల‌గా మారిపోయింది. మ‌న పొరుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి. కానీ ఉత్త‌ర భార‌తంలో మాత్రం ప‌రిస్థితి వేరేలా ఉంది. ఢిల్లీ, హ‌ర్యానాతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో మాత్రం ఎండ‌లు మండిపోతున్నాయి. ఇక అమెరికా, కెన‌డా వంటి దేశాల్లో ఈ ఎండ‌ల‌కు త‌ట్టుకోలేక వంద‌లాది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక్క‌డ వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. అక్క‌డ ఉష్ణోగ్ర‌త‌లు అంత‌లా పెరిగిపోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా ! హీట్ డోమ్‌లు ఏర్ప‌డ‌టంతోనే ఉష్ణోగ్ర‌త‌లు ఇంత‌లా పెరిగిపోతున్నాయ‌ట‌. అస‌లు హీట్ డోమ్ ( Heat Dome ) అంటే ఏంటి? ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డానికి వాటికి ఏంటి సంబంధం? ఇప్పుడు తెలుసుకుందాం..

హీట్ డోమ్ ఎలా ఏర్ప‌డ‌తాయి

వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా ఇవి ఏర్ప‌డ‌తాయి. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెరిగిన‌ప్పుడు.. దాని చుట్టుప‌క్క‌ల ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌గా ఉండ‌టంతో వాతావ‌ర‌ణ పీడనం ఎక్కువ అవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వేడిగాలులు చుట్టుప‌క్క‌ల‌కు ఎటూ విస్త‌రించ‌లేవు. దీంతో వేడెక్కిన గాలి పైకి వెళ్లి స్ట్రాటోస్పియ‌ర్ పొర‌ను తాకుతాయి. అయితే స్ట్రాటోస్పియ‌ర్ పొర‌లో భూమి చుట్టూ తిరిగే ప‌వ‌నాలు (గాలి) ఉంటాయి. ఇవి భూమి మీద ఉష్ణోగ్ర‌త‌లు, ఆయా ప్రాంతాల్లోని పీడ‌నాల‌ను బ్యాలెన్స్ చేస్తుంటాయి. ఎప్పుడైతే వేడి గాలి పైకి వెళ్తుందో అప్పుడు అక్క‌డ పీడ‌నం అధిక‌మ‌వుతుంది. ఫ‌లితంగా పైకి వెళ్లిన వేడి గాలుల‌ను మ‌ళ్లీ కింద‌కు తోస్తాయి. దీనివ‌ల్ల ఆ ప్రాంతంలోని మేఘాలు చెల్ల‌చెదుర‌వుతాయి. అప్పుడు గాలి ఒత్తిడి పెరిగి, భూమి మీద ఎండ నేరుగా ప‌డ‌టంతో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతాయి. దీన్నే హీట్ డోమ్ అంటారు. ఇలా ఏర్ప‌డిన హీట్ డోమ్ ఒక్కోసారి రెండు మూడు వారాల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగుతాయి. కొద్దిరోజులుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా చోట్ల ఈ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.

ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్ర‌త‌లు

- Advertisement -

సాధార‌ణంగా భార‌త్‌లో మార్చి నుంచి జూన్ వ‌ర‌కు ఎండ‌లు అధికంగా ఉంటాయి. అదే ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో జూలై వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వ‌డ‌గాడ్పులు కొన‌సాగుతాయి. ఈసారి కూడా జూలైలో అధిక ఉష్ణోగ్ర‌త‌లే న‌మోదవుతున్నాయి. కానీ అవి గ‌తంలో కంటే చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఢిల్లీలో గురు, శుక్ర‌వారాల్లో 43 డిగ్రీల‌కు పైగానే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 90 ఏళ్ల త‌ర్వాత‌ జూలై నెల‌లో ఈ స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. సాధార‌ణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ‌. దీనంత‌ట‌కీ ఢిల్లీ, హ‌ర్యానా ప‌రిస‌ర ప్రాంతాల్లో హీట్ డోమ్ ఏర్ప‌డ‌ట‌మే కార‌ణ‌మ‌ని ఐఎండీ ప్ర‌క‌టించింది.

అమెరికా, కెన‌డాల్లోనూ అంతే..

అమెరికా, కెన‌డా దేశాల్లోనూ రికార్డు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. మండుతున్న ఎండ‌ల కార‌ణంగా అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయంటే అక్క‌డ ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉందో అర్థమ‌వుతుంది. అమెరికా, కెన‌డా దేశాల్లో ఇప్పుడిప్పుడే వేస‌వికాలం మొద‌ల‌వుతుంది. స‌మ్మ‌ర్ మొద‌ల‌య్యే స‌మ‌యంలోనే ఇలా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌టంతో ముందు ముందు ఎలా ఉండ‌బోతుందోన‌ని అమెరికావాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండ‌లు తాళ‌లేక ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణించారు. ఇక వ‌డ‌గాడ్పుల కార‌ణంగా కెన‌డాలో 240 మందికిపైగా మ‌ర‌ణించారు. కెన‌డా చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. దీంతో అమెరికా, కెన‌డాల్లో స్కూళ్లు, కొవిడ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌ను మూసేశారు. రోడ్ల మీద తిరిగే జ‌నం కోసం తాత్కాలికంగా వాట‌ర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల కూలింగ్ సెంట‌ర్లు ఓపెన్ చేశారు. మరోవైపు రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరప్‌ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి.

భ‌విష్య‌త్తులో నిప్పుల కొలిమే

భార‌త్‌లో మ‌రో ఇర‌వై ఏళ్లలో ఎండ‌ల తీవ్ర‌త ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుతుంద‌ని ది ఎక‌న‌మిస్ట్ మ్యాగజైన్ వెల్ల‌డించింది. 2041 నాటికి దేశంలో ఉష్ణోగ్ర‌త‌ల‌కు 50 డిగ్రీల‌కు చేర‌తాయ‌ని పేర్కొంది. ముఖ్యంగా చెన్నైలో ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని.. ఎండ‌ల తీవ్ర‌త‌కు వేల మంది చ‌నిపోతార‌ని అంచనా వేసింది. హైద‌రాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయని తెలిపింది. కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌లు, వాతావ‌ర‌ణ మార్పులు, ఇత‌ర‌త్రా అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ నివేదిక‌ను రూపొందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Monsoon Diet : వ‌ర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి

ఆగ‌కుండా ఎక్కిళ్లు వ‌స్తున్నాయా ?ఇలా చేస్తే చిటికెలో ఆగిపోతాయి

3జీ, 4జీ, 5జీ తెలుసు.. మ‌రి ‘జీరో’ జీ ఉంద‌ని తెలుసా !

స్నానానికి ఏ నీళ్లు మంచివి?

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement