Sudarshana Chakra | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్‌లోని 15 కీలక నగరాలపై దాడులు చేయడానికి పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులనే కాకుండా గురువారం రాత్రి జమ్ము, పంజాబ్, రాజస్థాన్‌లోని కీలక స్థావరాలపై పాక్ పంపించిన ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధవిమానాలను రష్యాకు చెందిన ఎస్-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసింది. దీంతో ఏమిటీ ఈ వ్యవస్థ? ఎలా పనిచేస్తుంది అన్నదానిపై అంతటా ఆసక్తి నెలకొన్నది.
ఏమిటీ సుదర్శన చక్ర?
400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు దేశాలకు చెందిన స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ను సుదర్శన చక్రగా భారత ఎయిర్‌ఫోర్స్ పిలుస్తున్నది. ప్రపంచంలోనే అత్యాధునిక క్షిపణి నాశక వ్యవస్థల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు సేనల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు కలదు.
ఎందుకు ఆ పేరు?
పురాణాల్లో విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కూడా 360 డిగ్రీల కోణంలో శత్రు సేనల డ్రోన్లు, క్షిపణులను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలదు. అందుకే దీనికి ‘సుదర్శన చక్ర’గా నామకరణం చేశారు.
మన దగ్గర ఎన్ని ఉన్నాయి?
ఎస్-400 శ్రేణికి చెందిన ఐదు రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ 2018లో రష్యాతో ఒప్పందం చేసుకొన్నది. ఇప్పటికే మూడు ఎస్-400 స్కాడ్రన్లు అందుబాటులోకి రాగా మరో రెండు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నాయి. మూడింటి కోసం భారత్ రూ. 30 వేల కోట్లు వెచ్చించింది. పాక్ దాడులను తిప్పికొట్టడానికి 24 గంటల కిందటే భారత ఎయిర్‌ఫోర్స్ ‘సుదర్శన చక్ర’ సేవలను వినియోగించుకోవడం విశేషం.