Amit Shah | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ (BJP) గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయంటూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు (Lok Sabha elections ) ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు పైనే గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపీ మాత్రం ఏకంగా 400 సీట్లు గెలుస్తామంటూ గత కొంతకాలంగా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4న వెలువడే ఫలితాల్లో 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్ బి ఏంటి..? (BJPs Plan B) అని షాను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికరంగా స్పందించారు. అలా జరిగే అవకాశం తనకు కనిపించడం లేదని, ప్లాన్ బి అవసరం లేదని స్పష్టం చేశారు.
‘అలాంటి అవకాశాలు నాకు కనిపించడం లేదు. 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోదీకి అండగా ఉంది. వారికి కులం, వయసుతో సంబంధం లేదు. మోదీ అంటే ఏంటి.? ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి..? అనేది వారికి తెలుసు. ‘ప్లాన్ ఎ’ విజయవంతమవుతుంది. ‘ప్లాన్ ఎ’ సక్సెస్ కావడానికి 60 శాతం కంటే తక్కవు అవకాశం ఉన్నప్పుడే ‘ప్లాన్ బి’ ని రూపొందించాలి. మాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా అమిత్ షా స్పందించారు. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని తెలిపారు. కానీ తాము ఎన్నడూ అలా చేయలేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అమిత్ షా విమర్శించారు. లోక్‌సభలో 400 సీట్లతో సరిహద్దులను పరిరక్షించాలని, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, పేదల సంక్షేమానికి భరోసా ఇవ్వాలని బీజేపీ కోరుకుంటోందని ఈ సందర్భంగా అమిత్ షా వివరించారు.
Also Read..
Patna school | పాఠశాల డ్రైన్లో శవమై కనిపించిన మూడేళ్ల బాలుడు.. స్కూల్‌కు నిప్పంటించిన బాధితులు
PM Modi | అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును వారికి చెందేలా చేస్తాం : ప్రధాని మోదీ
Everest | ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై బ్యాన్ విధించిన నేపాల్