కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పరాజయం పాలైన తరువాత ఆ పార్టీలో మునుపెన్నడూ లేని స్థాయిలో అసమ్మతి వ్యక్తం అవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా పార్టీ అగ్రనాయకత్వపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంతో శనివారం ముగ్గురు అధికార ప్రతినిధులను ఆరేండ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ వారిలోని తిరుగుబాటు ధోరణి తగ్గడం లేదని తెలుస్తున్నది.
టీవీ డిబేట్లలో పార్టీ వాణిని బలంగా వినిపించే అధికార ప్రతినిధి రిజు దత్తా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సువేందుపై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలు టీఎంసీ నాయకత్వం ఒత్తిడి, బెదిరింపుల మేరకే చేశానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని టీఎంసీ ఆదేశించినా ఆయన వెళ్లలేదు. మాజీ క్రికెటర్, మమత క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మనోజ్ తివారీ సైతం పార్టీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, తాను అంత డబ్బు ఇచ్చేందుకు నిరాకరించానని తెలిపారు.