కట్టంగూర్, జూలై 25 : రైతు చెమటతో పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరితే మద్దతు ధర దక్కాలి.. కానీ కట్టంగూర్ మండలంలోని కల్మెర, పందనపల్లి, దుగినవెల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతుల కష్టానికి ఫలితం దక్కకపోగా అక్రమాల తలుపులు తెరుచుకున్నాయనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పొలాల్లో పండిన దిగుబడుల కంటే రికార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యం మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా చూపించడం వెనుక పెద్ద గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రాల నిర్వాహకులు ధాన్యం బస్తాలను మిల్లర్లు కట్ చేశారంటూ షార్టేజీ చూపిస్తూ రైతుల ధాన్యాన్ని తమ బంధువుల పేర్లతో రాసుకున్నారని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
రికార్డుల్లో మాయాజాలం
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం కల్మెరలో 416 ఎకరాల్లో వరి సాగుకు సుమారు 13వేల క్వింటాళ్లు, పందనపల్లిలో 450 ఎకరాలకు 13 వేల క్వింటాళ్లు, దుగినవెల్లిలో 550 ఎకరాల్లో 17వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే దిగుబడి రావాల్సి ఉంది. అయితే కల్మెరలో 31,634 వేల క్వింటాళ్లు, పందనపల్లిలో 25,635 వేల క్వింటాళ్లు, దుగినవెల్లిలో 29 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల నుంచి ముందుగానే మిల్లర్లు కొనుగోలు చేసి, నిల్వ ఉంచిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకోసం నకలీ ట్రక్ షీట్లు, నకిలీ లారీ నంబర్లు సృష్టించి తప్పుడు రవాణా వివరాలు నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో సూత్రధారులు..పాత్రధారులు ఎవరనే అనుమానాలు వస్తున్నాయి. కేంద్రాల నిర్వాహకులా.. మిల్లర్లా, లారీ ఆసోసియేషన్ సభ్యులా.. లేక కార్యాలయ అధికారి పాత్ర ఏమైనా ఉన్నదా అనే అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఎంత ధాన్యం పండింది? ఎంత కొనుగోలు చేశారు? రికార్డుల్లో చూపిన ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ దందా అంతా సీఈవో కనుసన్నల్లో నడుస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇన్చార్జీల జేబుల్లోకి మళ్లింపు..
కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు జరిగిన ఖర్చు అకాశాన్నంటుతోంది. కేంద్రం ఏర్పాటు కోసం స్థలాన్ని లీజుకు తీసుకోవడం, గుడిసెలు ఏర్పాటు, మంచినీళ్ల సౌకర్యంతో పాటు ఇతర ఖర్చులు లెక్కకు మించి ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఖర్చు పెట్టకుండానే పెట్టినట్లు చూపిస్తూ పందనపల్లిలో 2.20లక్షలు, కల్మెరలో 2.20లక్షలు, దుగినవెల్లిలో 2.50లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఖర్చు చేయకుండా చేసినట్లు చూపి, ఆ డబ్బులను ఇన్చార్జీల జేబుల్లోకి మళ్లించుకున్నా సీఈవో పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
దుగినవెల్లి కేంద్రంలో జరిగిన అవకతవకలపై రెండు సార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. రైతుల కష్టాన్ని కొందరు నిలువునా దోచుకు తింటున్నారు. రైతుల ధాన్యాన్ని ఇన్చార్జీలు తమ పేరిట నమోదు చేసుకున్నారు. దొంగ ట్రక్ షీట్లు, నకిలీ లారీ నంబర్లు సృష్టించి అసలైన రైతులకు బదులుగా రైతులు కాని వారి పేర్లను నమోదు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలి.
– జాల అంజనేయులు, మాజీ ఉప సర్పంచ్, ఇస్మాయిల్పల్లి
నాకు తెలియదు
ధాన్యం కొనుగోలు విషయంపై పీఏసీఎస్ సీఈవో మల్లారెడ్డిని వివరణ కోరగా తనకేమీ తెలియదన్నారు. అంతా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలకే తెలుసని ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. అదే విధంగా పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి నాగేశ్వరావును వివరణ కోరగా ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలకు సంబంధించిన సమస్య ఇంతవరకు తమ దృష్టికి రాలేదన్నారు. తమ పరిధిలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఏవైనా సమస్యలు తమ దృష్టికి వస్తే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.