Kiren Rijiju : వక్ఫ్ సవరణ చట్టం (Waqf Act) ను నిరసిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఆందోళన వ్యక్తంచేశారు. నిరసనల పేరిట సీఎం మమతా బెనర్జినే బెంగాల్లో హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని దీదీ చెప్పారని, ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టారని గుర్తుచేశారు.
దేశంలో వక్ఫ్ చట్టం గత వారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా బీజేపీ నేతల విమర్శలపై మమతా బెనర్జి మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. తమపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదిలావుంటే బెంగాల్ హింసలో ఉగ్ర సంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.