కోల్కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం సిలిగురిలో విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘సర్’ పేరుతో ప్రజలను వేధిస్తున్నదని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు అంటే ‘నోట్ బందీ’ అయినట్లుగానే, ‘సర్’ అంటే ఓట్ బందీ అని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికలకు ముందే ‘సర్’ను ఎందుకు నిర్వహిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ కసరత్తును ఆపేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల సవరణ దీనిని బలవంతంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను బీజేపీ జైలుకు పంపవచ్చునని, లేదా తన గొంతును కోయవచ్చునని, ప్రజల ఓటు హక్కుకు మాత్రం కళ్లెం వేయకూడదని అన్నారు.