కోల్కతా : ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాబోనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా? అని మమతను మీడియా అడుగ్గా.. ‘నాకు ఆహ్వానం రాలేదు. నేను వెళ్లను’ అని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధ, చట్టవిరుద్ధ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే, తాను శుభాకాంక్షలు చెప్పలేనన్నారు. మూడింట రెండొంతుల ఆధిక్యత సంపాదించాలని మోదీ అనుకున్నారని, అయితే మ్యాజిక్ మార్క్ 272 అయినా బీజేపీకి రాలేదని ఎద్దేవా చేశారు.
గతంలో చర్చ జరగకుండానే బిల్లులను ఆమోదించుకునేవారని, ఇప్పుడు అది సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి నేడు చెప్పలేదని, అంటే దాని అర్థం రేపు చెప్పబోదని కాదన్నారు. మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని, పరిస్థితిని గమనిస్తున్నామని చెప్పారు. ఇది మోదీ వ్యతిరేక తీర్పు అని, ఆయన పీఎంగా ప్రమాణ స్వీకారం చేయకూడదని అన్నారు.