West Bengal : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతం కావడంతో భారీ భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. గురువారం మొదటి దశలో 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 62 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే, బెంగాల్‌లోని అనేక చోట్ల భారీ ఘర్షణలు జరుగుతున్నాయి.
పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముర్షీదాబాద్‌లో తీవ్ర ఘర్షణలు జరిగాయి. టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీ అనే పార్టీకి చెందిన నేతల కారును ధ్వంసం చేశారు. టీఎంసీ కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అలాగే, నోవ్డా ప్రాంతంలో నాటు బాంబులు విసరడంతో పలువురికి గాయలయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు రంగప్రవేశం చేసి పరిస్తితిని అదుపులోకి తెచ్చాయి. ముర్షీదాబాద్‌లో ఘర్షణలపై నివేదిక ఇవ్వాలని డీఎం/డీఈవోలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు సరిగ్గా పని చేయలేదు. దీంతో ఆయా చోట్ల కొద్దిసేపు ఎన్నికలు నిలిచిపోయాయి.
మెదినీపూర్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ ఒక వృద్ధుడు గుండెపోటు కారణంగా మరణించాడు. మరోవైపు.. కేంద్రబలగాలు ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నాయని టీఎంసీ నేతలు ఆరోపించారు. బెంగాల్‌లోని అనేక పోలింగ్ కేంద్రాలలో బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికలు ప్రధానంగా టీఎంసీ, బీజేపీ కూటమి మధ్య పోటీగా సాగుతున్నాయి. రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.