న్యూఢిల్లీ : దేశంలో ఉగ్రవాదుల ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సరైన, కచ్చితమైన సమాధానం ఇస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఆయన తొలిసారిగా గురువారం అస్సాంలో జరిగిన సభలో బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరైనా తాము జరిపిన పిరికిపంద దాడే తమ విజయంగా భావిస్తే.. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ దేశం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ఒక్కరినీ వదలం. ప్రతి ఉగ్రవాదిని వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అన్నారు. దేశంలోని ఏ మూలలో ఉన్న ఉగ్రవాదాన్నయినా కూకటివేళ్లతో పెకలించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.