న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘భారత్‌పై దుష్టుల కన్ను పడింది. సైనికులతో కలిసి పనిచేసి.. వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతాం. ప్రధాని మోదీ పనితీరు, పట్టుదల గురించి అందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుందని నేను హామీ ఇస్తున్నా’ అని అన్నారు. ‘దేశ సరిహద్దుల్ని కాపాడుకోవటంతోపాటు, సైనికులతో కలిసి పనిచేయటం మంత్రిగా నా బాధ్యత’ అని రాజ్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.