న్యూఢిల్లీ, అక్టోబర్ 3: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త బీహార్ వాసి ప్రశాంత్ కిశోర్ శపథం చేశారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసి రకమని అవహేళన చేసి బీహారీలను రేవంత్ రెడ్డి అవమానించారని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్న ప్రశాంత్ కిశోర్ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కన్నా బీహారీల డీఎన్ఏ నాసిరకమని ఈ వ్యక్తి(రేవంత్) అంటున్నాడు.
అదే నిజమైతే ‘సాయం చేయండంటూ నన్ను ఎందుకు అడుక్కున్నాడు? రాహుల్ గాంధీ కూడా ఆయనను కాపాడలేరు. ఆయనను ఎవరూ కాపాడలేరు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి తీరతాను అని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాజకీయ వ్యూహకర్తగా ఉన్న తన వద్దకు రేవంత్ రెడి ్డమూడుసార్లు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎంత గర్వం తలకెక్కిందంటే మా బీహారీలనే అవమానించారు అంటూ కిశోర్ మండిపడ్డారు. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ది బీహార్ డీఎన్ఏ అంటూ ఆరోపణలు గుప్పించారు. తనది తెలంగాణ డీఎన్గా వర్ణించుకుంటూ, కేసీఆర్ కన్నా తానే ముఖ్యమంత్రి పదవికి అర్హుడినని, బీహార్ డీఎన్ఏ కన్నా తెలంగాణ డీఎన్ఏనే గొప్పదని రేవంత్ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్‌కు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇవే వ్యాఖ్యలను ఆయన గుర్తుచేసుకుంటూ మా కన్నా మీ డీఎన్ఏ గొప్పదైతే సాయం కోసం మా దగ్గరకు ఎందుకు వచ్చావు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. బీజేపీ నుంచి టీడీపీకి, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిని రాజకీయ విశ్వాస ఘాతకునిగా కిశోర్ అభివర్ణించారు.