Mallikarjun Kharge : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరఫున మల్లికార్జున ఖర్గే మాట్లాడారు.
ఈ బిల్లును తాము వ్యతిరేకిండచం లేదన్నారు. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు సానుకూలమే. కానీ, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానంలోనే మాకు అభ్యంతరాలున్నాయి. ఈ బిల్లు రాజకీయ ప్రేరేపితమైందిగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే కేంద్రం ఈ పని చేస్తోంది. అయినప్పటికీ మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ వస్తున్నాం. కానీ, గతంలో చేసిన మార్పుల్ని అమలు చేయాలని కోరాం. డీ లిమిటేషన్ అంశంలో కూడా కేంద్రం కొన్ని మెలికలు పెడుతోంది. ఈ అంశంపై అన్ని పార్టీలు పార్లమెంట్లో పోరాడుతాయి. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తాం. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం.
డీలిమిటేషన్‌కు సంబంధించి జనాభా గణన అంశంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలోని అన్ని హక్కుల్ని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే అస్సాం, జమ్ము కాశ్మీర్లో ఈ విషయంలో మోసం చేశారు. ప్రతిపక్షంగా మేం ఐక్యంగా ఉన్నాం’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇండియా బ్లాక్‌కు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోఆటు ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.