సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 55,74,793 మంది ఓటర్లు వీరి అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో 67,532 మంది సైనికోద్యోగులు ఉండగా, 43,173 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7884 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 71 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదుకాలేదు.
కాగా, వరుసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారం ఇవ్వని హిమాచల్ ఓటర్లు ఈ సారి ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్, బీజేపీ, ఆప్ త్రిముఖ పోరులో అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ప్రతిసారి కొత్త పార్టీకి అవకాశం ఇస్తున్నట్టు పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తారా? లేక అధికార పార్టీకే పట్టం కట్టి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తారా? అనే విషయం వచ్చే నెలలో తేలనుంది.