న్యూఢిల్లీ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు. ఈ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. వీటితోపాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. 96 లోక్సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ జరుగున్నది.
ఈ లోక్సభ ఎన్నికల విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, టీఎంసీ ఫైర్ బ్రాండ్ మహు వా మొయిత్రా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నిత్యానంద్ రాయ్, పంకజ ముండే, తదితర నేతలు భవితవ్యం ఈ దశ ఎన్నికల్లో తేలనున్నది. లఖింపూర్ హింసాకాండలో నిందితుడైన అశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తిరిగి అదే స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కాగా, 543 సీట్లు ఉండే లోక్సభలో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో 283 స్థానాల్లో(52 శాతం) పోలింగ్ పూర్తయింది.
ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 3.32 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరికోసం అధికారులు 35,809 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులుండగా వీరిలో 50 మంది మహిళలున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో 2.51లక్షల మంది ఓటర్ల కోసం 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు,106 నియోజకవర్గాల్లో సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లను లెక్కిస్తారు.
రాష్ట్రంలో ఇప్పటికే 2,08,163 మంది ఓటేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ వెసులుబాటుతో దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1.88 లక్షల మంది ఉద్యోగులు సైతం ఓటేశారు. అన్ని విభాగాలకు చెందిన 2.94 లక్షల మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఐదు మోడల్ కేంద్రాలు ఉంటాయి. స్థానికత ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దారు. 597 కేంద్రాల్లో మహిళలు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సెంటర్లలో దివ్యాంగులు, 119 పోలింగ్ కేంద్రాల్లో యువతీయువకులే పూర్తిగా విధులు నిర్వర్తించనున్నారు.