న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ(Special Intensive Revision) జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల బీహార్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు కొన్ని మీడియా వర్గాల ద్వారా వెల్లడైంది. అయితే ఎప్పటి నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుందన్న దానిపై స్పష్టత లేదు. ఆ భారీ కసరత్తుకు చెందిన తేదీలను ఇంకా ప్రకటించలేదు.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య ఎన్నికల అధికారులతో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు కావాల్సిన అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ద్వారా సుమారు 65 లక్షల ఓటర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే దేశశ్యాప్తంగా అక్రమ ఓటర్లను తొలగించేందుకు త్వరలో ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను మొదలుపెట్టనున్నది.