Viral news : కట్టుకున్న భార్య (Wife) మాటిమాటికి ప్రియుడితో లేచిపోతుండటంతో అతడు విసిగిపోయాడు. ఆమెతో తాను కాపురం చేయలేనని, విడాకులు కావాలని కోర్టు (Court) ను ఆశ్రయించాడు. అతడి మొర ఆలకించిన కోర్టు ఎట్టకేలకు విడాకులు (Divorce) మంజూరు చేసింది. ఈ సందర్భాన్ని అతడు వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అసోం రాష్ట్రం నల్బరి జిల్లాకు చెందిన మానిక్ అలీ అనే వ్యక్తి తన భార్య ప్రవర్తనతో విసిగిపోయాడు. పెళ్లయిన తర్వాత ఆమె రెండు సార్లు ప్రియుడితో లేచిపోయినా తిరిగొచ్చిన తర్వాత మందలించి అక్కున చేర్చుకున్నాడు. తాజాగా మరోసారి ఆమె లేచిపోయింది. దాంతో మానిక్ అలీ ఆమెతో కాపురం వద్దని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశాడు. పలు దఫాల వాయిదాల అనంతరం కోర్టు అతడికి విడాకులు మంజూరు చేసింది. మానిక్ అలీ ఈ విషయాన్ని తన లాయర్ ద్వారా తెలుసుకున్నాడు. అంతే ఇక అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ శుభ సందర్భంలో అతడు పాలతో స్నానం చేశాడు.
తన ఇంటి ముందు ఓ ప్లాస్టిక్ సీట్లో నాలుగు పాల బకెట్లు పెట్టుకుని, ఒకటి తర్వాత ఒకటి నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసుకున్నాడు. ఈ రోజు తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పుకుంటూ పాలు నెత్తిలో పోసుకున్నాడు. ఆమె ప్రియుడితో లేచిపోయినా తన కుటుంబ శాంతి కోసం భరించానని చెప్పాడు. ఈ ఘటనను మొత్తం తన మొబైల్లో బంధించాడు.
ఆ తర్వాత ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి ఆ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.