N Chandrasekharan | టాటా సంస్థకు చెందిన దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) విమానం గత గురువారం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరి డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekharan) తాజాగా స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పారు.
‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు రావట్లేదు. టాటా సంస్థ నడిపే విమానయాన సంస్థలో ఈ ప్రమాదం జరిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ఘటనకు గానూ బాధిత కుటుంబాలకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను’ అని అన్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రాథమిక స్థాయి ఫలితాలు రావడానికి ఒక నెల సమయం పడుతుందన్నారు. విమానం అత్యంత భద్రతా ప్రమాణాలతో పనిచేస్తుందని.. ఇటీవలే జరిగిన తనఖిల్లో ఎలాంటి సాంకేతికలోపాలు గుర్తించలేదని ఆయన వివరించారు. పైలట్లు సైతం అనుభవజ్ఞులైనవారేనని స్పష్టం చేశారు.
‘మానవ తప్పిదాలు, ఎయిర్‌లైన్స్, ఇంజిన్లు, నిర్వహణ గురించి అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ ఏఐ171 విమానానికి క్లీన్ హిస్టరీ ఉంది. విమానం కుడివైపున ఉన్న ఇంజిన్‌ను మూడు నెలల క్రితమే (2025 మార్చి) ఓవర్ హాలింగ్ సమయంలో అమర్చాం. ఎడమవైపు ఇంజిన్‌కు చివరిసారిగా జూన్ 2023లో నిర్వహణ పనులు చేపట్టారు. తదుపరి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2025లో నిర్వహించాల్సి ఉంది. ఇక ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన పైలట్లు సైతం అనుభవజ్ఙులైన వారే. కెప్టెన్ సభర్వాల్‌కు 11,500 గంటలకుపైగా విమానయాన అనుభవం ఉంది. కుందర్‌కు 3,400 గంటలకుపైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎలాంటి నిర్ధారణకూ రాలేము. బ్లాక్ బాక్స్, రికార్డర్ల ద్వారా ఘటనకు గల కారణాలు తెలుస్తాయి. అప్పటి వరకూ వేచి ఉండాలి’ అని చంద్రశేఖరన్ వివరించారు. ప్రమాదానికి గల కారణాలు గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, DGCA కూడా ఒక కమిటీని నియమించిందని చెప్పారు.
Also Read..
Operation Sindhu | ఇరాన్ నుంచి భారత్‌కు చేరిన 110 మంది విద్యార్థులు
Assembly Bypolls | నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఒక్క రాత్రికి రూ.2,400 కోట్లు!.. ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు వెచ్చిస్తున్న ఇజ్రాయెల్ !