హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Assembly Bypolls) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదుచోట్లా అధికార పార్టీలకు చెందిన స్థానాలు మూడు ఉండగా, ఒక చోట విపక్ష ఆప్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.
పంజాబ్లోని (Punjab) లూథియానాలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణించారు. దీంతో ఉపఎన్నిక బరిలో రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆప్ తన అభ్యర్థిగా నిలిపింది. ఇక కాంగ్రెస్ నుంచి భరత్ భూషన్ అషు, బీజేపీ నుంచి జైవాన్ గుప్తా పోటీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్లోని (West Bengal) కాళీగంజ్ టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణించారు. దీంతో ఆయన కుమార్తెను అధికార పార్టీ బరిలో నిలిపింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని దక్కించుకుని తన బలాన్ని చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.
ఇక గుజరాత్లో (Gujarat) కాడి బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్భాయ్ సోలంకీ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అదేవిధంగా విసవడర్ ఆప్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ రెండు చోట్ల త్రిముఖపోటీ నెలకొన్నది. రెండు స్థానాలను నిలుపుకోవాలని బీజేపీ, ఆప్ భావిస్తుండగా, ఇరు పార్టీలను ఖంగు తినిపించాలని కాంగ్రెస్ చూస్తున్నది.
వచ్చే ఏడాది అసెబ్లీ ఎన్నికలు జరుగునున్న కేరళలో (Kerala).. నీలాంబర్ స్థానానికి ప్రస్తుతం బైపోల్ జరుగుతున్నది. గత ఎలక్షన్లలో ఈ సీటు నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన పీవీ అన్వర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జరుగుతున్న ఉపఎన్నికలో ఆయన ఇండిపెండెంట్గా మరోసారి పోటీచేస్తుండగా, కాంగ్రెస్, వామపక్ష కూటమి తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు జూన్ 23న వెలువడనున్నాయి.