Varanasi | వారణాసి : ప్రధాని మోదీ సొంత నియోజక వర్గంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇటీవల వారణాసి జిల్లా డిప్యూటీ జైలర్‌ను జైలర్ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూడగా, తాజాగా ఓ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. పన్నెండో తరగతి విద్యార్థినిపై 22 మంది వారం పాటు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని యూపీలోని వారణాసి పోలీసులు మంగళవారం తెలిపారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలినవారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
మార్చి 29న ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లిన తమ కూతురు అదృశ్యమైందని విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెను కిడ్నాప్ చేసినవారు ఈ నెల 4న బాధితురాలికి మత్తు మందు ఇచ్చి, వదిలేశారు. అక్కడి నుంచి ఆమె తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె తాను ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల గురించి తన తండ్రికి తెలిపింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై 22 మంది హుక్కాబార్, హోటల్, లాడ్జి, గెస్ట్ హౌస్ వంటి వేర్వేరు చోట్ల అత్యాచారం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు.