Snake bites | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఫతేపూర్ (Fatehpur)కు చెందిన 24 ఏళ్ల వికాస్ దూబేని మరోసారి పాము కాటేసింది (Snake bites). ఇలా వికాస్ పాము కాటుకు గురికావడం ఇది మొదటిసారో, రెండోసారో కాదండోయ్.. 40 రోజుల్లో ఏకంగా ఏడోసారి..! ఆశ్యర్యంగా ఉంది కదూ.. అయినా ఇది నిజమే. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జూన్ 2న రాత్రి ఇంట్లో తొలిసారి వికాస్‌ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. 10న మరోమారు అతడు పాముకాటు బారినపడ్డాడు. చికిత్స తీసుకున్నాక పాములంటే అతడికి భయం పుట్టింది. నిత్యం అప్రమత్తంగా ఉండేవాడు. అయినప్పటికీ అదే నెల 17న మళ్లీ అతడిని పాము కాటేసింది. ఈసారి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మళ్లీ అదే దవాఖానలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పాము కాటేసింది. మళ్లీ వచ్చిన దూబేను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యులు, బంధువుల సలహా మేరకు దూబేను కుటుంబ సభ్యులు సొంత ఇంటికి దూరంగా ఫతేపూర్‌లోని రాధానగర్‌లో ఉంటున్న అతడి అత్తయ్య ఇంటికి తరలించారు. దురదృష్టం మరోమారు వెంటాడడంతో అక్కడ కూడా ఐదోసారి పాము కాటేసింది.
మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం చేసేదేమీ లేక అతడిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత జులై 6న మరోమారు అతడిని పాము కాటేసింది. పరిస్థితి విషమించడంతో అతడి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరాడు. అయితే, పాము తనను శని, ఆదివారాల్లోనే కాటు వేస్తున్నట్లు.. కాటువేసే ముందు ప్రతిసారీ తనకు తెలిసిపోతుందని దూబే ఇదివరకే ఒక సందర్భంలో చెప్పాడు. ఇక తాజాగా గురువారం రాత్రి ఏడోసారి పాము కాటుకు గురైన దూబే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించినా ప్రస్తుతానికి నిలకడగానే ఉందని.. పరిస్థితి పూర్తిగా అంచనా వేసేందుకు 12 నుంచి 24 గంటలు పడుతుందని దూబేకి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ జవహర్ తెలిపారు.
కాగా, ఇటీవల ఆరోసారి పాము కాటుకు గురైన సమయంలో వికాస్ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు. అతడికి ఓ కల వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కలలో తనను ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వివరించాడు. ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతి సారి ఆడ పాము కాటు వేస్తోందని అది కూడా శని లేదా ఆదివారాల్లో మాత్రమే ఇలా జరుగుతోందని చెప్పాడు. వరుస పాము కాటుల నేపథ్యంలో వికాస్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వికాస్‌కు చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
70 Hour Work Week | ఎక్కువ పనిగంటలా.. మరణాన్ని ఆహ్వానించడమే : ప్రముఖ న్యూరాలజిస్ట్
Laugh Daily | రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన జపాన్
Joe Biden | కమలా హ్యారిస్‌కు బదులు యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ నోరుజారిన బైడెన్