70 Hour Work Week | అంతర్జాతీయంగా భారత్ ధీటైన పోటీ ఇవ్వాలంటే మన యువత వారానికి 70 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని గత ఏడాది అక్టోబర్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు, టెక్ దిగ్గజం నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదానికి దారి తీసి విషయం తెలిసిందే. మూర్తి వ్యాఖ్యలను పలువురు సమర్ధించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే అనర్థాలను టాప్ న్యూరాలజిస్ట్ (neurologist) ఒకరు తాజాగా వివరించారు.
ఎక్కువ సేపే పనిచేయడం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అని తెలిపారు. ఇలా చేయడం అకాల మరణాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. అనేక శాస్త్రీయ అధ్యయనాలను ఉటంకిస్తూ ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే అనర్థాలను హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన టాప్ న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ (Sudhir Kumar) ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరించారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అకాల మరణాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు (Premature Death Risk).
‘వారానికి 55 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 35 శాతం ఎక్కువ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. 35-40 గంటలు పని చేయడంతో పోలిస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌తో మరణించే ప్రమాదం 17 శాతం ఎక్కువ. వారానికి 55 గంటలు పనిచేయడం వల్ల ఏటా 8 లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. సుదీర్ఘ పని గంటలతో అధిక బరువు, ప్రీడయాబెటిస్, టైప్ -2 మధుమేహం వంటివి పెరుగుతాయి. ఇది అనేక వ్యాధులకు, ముందస్తు మరణానికి దారితీస్తుంది. ఇక వారంలో 40 గంటల పనిచేసే వారి కన్నా 69 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు పనిచేసే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి’ అని వివరించారు. సీఈవోలు తమ కంపెనీ లాభాలను, నికర విలువల్ని పెంచుకునేందుకు ఉద్యోగులకు ఎక్కువ పని గంటలను సిఫార్సు చేయడానికి మొగ్గు చూపుతారని ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ పేర్కొన్నారు.
Also Read..
Laugh Daily | రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన జపాన్
Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్
Arvind Kejriwal | ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయినా జైల్లోనే