Joe Biden | అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రవర్తన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో హెడ్లైన్స్లోకెక్కిన బైడెన్.. ఇప్పుడు మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) అనబోయి.. ఉపాధ్యక్షుడు ట్రంప్ (Vice President Trump) అని సంభోదించారు.
నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా..?’ అని విలేకరులు బైడెన్‌ను ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు సమాధానమిస్తూ.. ‘అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు’ అంటూ బదులిచ్చారు. అక్కడ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనకుండా ట్రంప్ అనడంతో ఇప్పుడు బైడెన్ మానసిక పరిస్థితి మరోసారి చర్చకు దారితీస్తోంది.
ప్రెసిడెంట్ పుతిన్ అంటూ జెలెన్స్కీని పరిచయం చేసిన బైడెన్
బైడెన్ మరో పొరపాటు కూడా చేసి ఇరుక్కుపోయారు. నాటో శిఖరాగ్ర సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేస్తున్న సమయంలో ‘ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పుతిన్..’ అని అనేశారు. ఇప్పుడు మైక్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడికి అప్పగిస్తానని, చాలా ధైర్యవంతుడని, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పలుకుతూ ప్రెసిడెంట్ పుతిన్ అని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత బైడెన్ తన వ్యాఖ్యలను వెంటనే సవరించుకున్నారు. ప్రెసిడెంట్ పుతిన్‌ను ఆయన ఓడిస్తారని, ఆయనే ప్రెసిడెంట్ జెలెన్స్కీ అని బైడెన్ తెలిపారు. పుతిన్‌ను ఓడించే అంశంలో తాను కూడా ఫోకస్ పెట్టినట్లు బైడెన్ చెప్పారు.
మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికం అవుతున్నాయి. ఈ తరుణంలో ఆయన తడబడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అధ్యక్షుడి మానసిక స్థితి సరిగా లేదంటూ సోషల్ మీడియాలో పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read..
President Joe Biden: ప్రెసిడెంట్ పుతిన్ అంటూ జెలెన్స్కీని పరిచయం చేసిన బైడెన్.. వీడియో
Arvind Kejriwal | ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయినా జైల్లోనే