Joe Biden | ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫు నుంచి జో బైడెన్ (Joe Biden), రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో బైడెన్‌కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ (George Clooney) సైతం బైడెన్ పోటీపై మౌనం వీడారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘ఈ అధ్యక్షుడితో మనం నవంబర్ ఎన్నికల్లో గెలవడం కష్టమే. ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ ఓడిపోతాం. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ ఆశలు లేవు. చట్ట సభ్యులు, గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు’ అని తెలిపారు.
బైడెన్లో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదని క్లూనీ అభిప్రాయపడ్డారు. ‘ఇటీవలే నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన్ను చూశాక గెలుపుపై ఆశలు పోయాయి. 2010, 2020 నాటి ఉత్సాహం కూడా ఆయనలో ఇప్పుడు కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, ఓ స్నేహితుడిగా బైడెన్‌ను తాను ఎంతో ప్రేమిస్తానని క్లూనీ చెప్పారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో అనేక ఆటుపోట్లను బైడెన్ సమర్థంగా ఎదుర్కొన్నారని అన్నారు. అయితే, ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలవడం ఖాయని.. అది ఊహించుకుంటనే భయంగా ఉందని క్లూనీ ఆందోళన వ్యక్తంచేశారు. డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చుతున్న (Top Fundraiser) వారిలో క్లూనీ ఒకరు. అంతేకాదు బైడెన్‌తో ఆయనకు సుదీర్ఘంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం గమనార్హం.
Also Read..
PM Modi | రెండు దేశాల పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
lightning strikes | షాకింగ్.. నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 37 మంది మృతి
Droupadi Murmu | సైనాతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO