వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(President Joe Biden)కు మతిమరుపు సమస్యలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వాషింగ్టన్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ మరోసారి తన మానసిక సమస్యను బయటపెట్టుకున్నారు. 81 ఏళ్ల బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేశారు. అయితే ఆ సమయంలో ప్రెసిడెంట్ పుతిన్ అని ఆయన అనేశారు. దీంతో అక్కడే ఉన్న జెలెన్స్కీ నవ్వేశారు.
ఇప్పుడు మైక్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడికి అప్పగిస్తానని, చాలా ధైర్యవంతుడని, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పలుకుతూ ప్రెసిడెంట్ పుతిన్ అని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత బైడెన్ తన వ్యాఖ్యలను వెంటనే సవరించుకున్నారు. ప్రెసిడెంట్ పుతిన్‌ను ఆయన ఓడిస్తారని, ఆయనే ప్రెసిడెంట్ జెలెన్స్కీ అని బైడెన్ తెలిపారు. పుతిన్‌ను ఓడించే అంశంలో తాను కూడా ఫోకస్ పెట్టినట్లు బైడెన్ చెప్పారు.
BIDEN: “Ladies and gentlemen, President Putin” 😳 pic.twitter.com/pId2QZ3Ao0
— RNC Research (@RNCResearch) July 11, 2024
తన పేరుకు బదులుగా పుతిన్ పేరును ఉచ్చరించిన బైడెన్‌ను చూసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నవ్వుకున్నారు. ఇటీవల డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చ సమయంలో కూడా బైడెన్ తన మతిమరుపు వ్యాఖ్యలతో తికమకపడ్డారు. అయితే అమెరికా అధ్యక్షుడికి కొందరి నుంచి అండ దొరికింది. ఈ సారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై అందరు దృష్టి పెట్టారు.
అప్పుడప్పుడు నాలుక జారడం సహజమే అని, ఎవరినైనా తీక్షణంగా పరిశీలిస్తే వాటిని మనం గమనిస్తామని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ తెలిపారు. బైడెన్ తన పొజిషన్లో కరెక్టుగానే ఉన్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ తెలిపారు. వివిధ రకాల వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బైడెన్.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని మరో వైపు కొన్ని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.