వారణాసి: ఉత్తరాదిలో పలు రాష్ర్టాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో ఎడ తెగని వర్షాల కారణంగా గంగా, యమున సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్, వారణాసిలో లక్షకు పైగా ఇండ్లలోకి వరద నీరు ప్రవేశించింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌పై విమర్శలు గుప్పించారు. ‘ప్రయాగ్‌రాజ్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా స్థానికుల ఇండ్లలోకి నీళ్లెలా వచ్చాయి? ఇది బీజేపీ మోసాలను బహిర్గతం చేస్తున్నది’ అని ఆయన అన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని చోటా బఘాడా ప్రాంతంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తమ నవజాత శిశువును దవాఖానకు తరలించడానికి ఆ చిన్నారి తల్లిదండ్రులు పీకల్లోతు వరద నీటిలో అవస్థలు పడుతూ నడవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మీద విపక్షాలు మండిపడ్డాయి. ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటిని ఆదివారం వరద ముంచెత్తినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రదీప్ నిషాద్ గంగా నదికి హారతి ఇచ్చి అందులో మునకలు వేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వచ్చింది.