న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి రానున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్‌పై గరిష్ఠ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలన్నదే అమెరికా లక్ష్యంగా కనపడుతోంది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్-ప్రొలిఫిరేషన్ చట్టం(ఐఎఫ్‌సీఏ) కింద 2018లో పోర్టు వద్ద వివిధ దేశాలపై విధించిన ఆంక్షలను అమెరికా మాఫీ చేసింది. దీంతో భారత్‌తోపాటు ఇతర దేశాలు అమెరికా ఆంక్షలు ఎదుర్కోకుండా పోర్టుపై తమ పనులను చేసుకునే వెసులుబాటు లభించింది.
చాబహార్ పోర్టు భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. పాకిస్థాన్‌ను తాకకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు ఇది వాణిజ్య మార్గాన్ని అందచేస్తోంది. ఇరాన్ పాలనను ఏకాకిని చేసేందుకు గరిష్ఠ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలన్న విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం(సెప్టెంబర్ 16) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత చాబహార్ పోర్టులో కార్యకలాపాలు సాగించే దేశాలపై ఐఎఫ్‌సీఏ కింద ఆంక్షలు అమలవుతాయని విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌ను తీవ్ర సంకట స్థితిలోకి నెట్టివేయనున్నది.