G20 Summit | రెండురోజులపాటు జరుగనున్న జీ20 సదస్సుకు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్నది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరిగే సదస్సు కోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలువురు దేశాధినేతలు భారత్ చేరుకున్నారు. ఈ సదర్భంగా ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఓవైపు ఆకలితో అలమటిస్తుంటే, ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం వెండి, బంగారు పాత్రల్లో ఖరీదైన వంటకాలు వడ్డించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలతో వాణిజ్య పరమైన ఒప్పందాలపై ఎలాంటి పురోగతి లేనప్పటికీ, విశ్వవేదికపై గొప్పలు చెప్పుకొంటూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రణాళికలో భాగంగా జీ20 సదస్సును ఓ వేదికగా మార్చుకోడానికి బీజేపీ పరీవారం సిద్ధమైంది. దీంతో పాటుగా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ హింసాకాండ, అదానీ వ్యవహారం తదితర సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్లాన్లో భాగంగానే జీ20 సదస్సు పేరుతో మోదీ సర్కార్ ఆర్భాటాలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు జీ20 సదస్సు వేళ తాజాగా కథనాలు వెలువరించాయి. సమస్యల వలయంలో దేశం చిక్కుకొని ఉండగా, ఆర్భాటాలకు పోవడం అవసరమా? అంటూ బీజేపీ సర్కారు వైఖరిని ఆయా పత్రికలు ఎండగట్టాయి. మరోవైపు బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితులు ఇతర దేశాల అధినేతలకు కనిపించకుండా ఉండేందుకు పేదలు నివాసం ఉండే మురికివాడలు కనిపించకుండా మోదీ సర్కార్ పరదాలతో కప్పేస్తున్నది.
ప్రధాని మోదీ తన సొంత ప్రతిష్ఠను పెంచుకోవడానికి జీ-20 సదస్సును వాడుకొంటున్నారు. అందుకే, మీడియా మాధ్యమాల్లో పెద్దయెత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల కోసమే ఇదంతా!
-న్యూయార్క్ టైమ్స్
జీ-20 సదస్సును ఆర్భాటంగా నిర్వహించాలన్న మోదీ సర్కారు ఆశ.. పేదలకు కాళరాత్రులను మిగిల్చింది. మూడు లక్షల మంది వీధివ్యాపారులు ఉపాధి కోల్పోయారు. పేదల ఇండ్లు నేలమట్టమయ్యాయి.
– ది గార్డియన్
సమస్యల వలయంలో భారత్ చిక్కుకొన్నది. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. పౌష్టికాహారలోపంతో చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. అయితే, వీటిని పట్టించుకొనేవారే లేరు.
– ది టెలిగ్రాఫ్
భారత్లో అభివృద్ధి అధఃపాతాళానికి చేరింది. నిరుద్యోగం తాండవిస్తున్నది. వీటి నుంచి దృష్టిమరల్చేందుకు భారత్ తీవ్రంగా శ్రమిస్తున్నది.
-ప్రాజెక్ట్ సిండికేట్
మణిపూర్లో హింసాకాండను కట్టడి చేయడంలో విఫలమైన మోదీ సర్కారు.. జీ-20 నిర్వహణకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమైంది.
-ఫారిన్ అఫైర్స్
భారత్లో మైనారిటీలపై దాడులు, వివక్ష కొనసాగుతున్నది. అయితే, అవేమీ పట్టించుకొనే పరిస్థితులు అక్కడ లేవు.
– ఫైనాన్షియల్ టైమ్స్
జీ-20 వంటి అంతర్జాతీయ సదస్సులు ఇప్పటికీ ఎన్నో భారత్లో జరిగాయి. వాటివల్ల జరిగిన లబ్ధి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి.
– అసోసియేటెడ్ ప్రెస్