గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 18:08:39

భార‌త్‌, చైనాల‌కు వెళ్లొద్దు: అమెరికా

భార‌త్‌, చైనాల‌కు వెళ్లొద్దు: అమెరికా

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేప‌థ్యంలో.. ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు దేశాలు ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించాయి. అయితే ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు కొంత‌మేర‌కు చ‌క్క‌బ‌డుతుండ‌టంతో క్ర‌మంగా ఆ ఆంక్ష‌ల‌ను స‌డలిస్తూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అమెరికా సైతం తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. అమెరికా పౌరులు వివిధ దేశాల‌కు రాక‌పోక‌లు సాగించ‌డానికి వీలు క‌ల్పిస్తూ లెవ‌ల్‌-4 సూచ‌న‌ను ఎత్తివేసింది. 

ఆ మేర‌కు లెవ‌ల్-4 జాబితాలో ఉండి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌క్కువ‌గాగ‌ల‌ ప‌లు దేశాల‌ను లెవల్‌-3 జాబితాలోకి మార్చింది. కానీ, భార‌త్‌, చైనాతోపాటు మ‌రో 50 దేశాల‌ను మాత్రం లెవ‌ల్-4 జాబితాలోనే కొన‌సాగిస్తున్న‌ది. దీంతో భారత్‌, చైనాతోపాటు మ‌రో 50 దేశాలకు ప్రయాణం చేయొద్దని అమెరికా త‌న‌ పౌరులకు సూచించిన‌ట్ల‌య్యింది. 

కరోనా వైరస్‌ తీవత్ర కారణంగా మార్చి 19 నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు లెవల్‌-4 సూచనను అమెరికా జారీచేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సూచ‌న అన్ని దేశాల‌కు వ‌ర్తించింది. ప్రస్తుతం కొన్నిదేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గడంతో ఆయా దేశాల‌కు నాలుగో స్థాయి సూచనను ఎత్తివేసి మూడో స్థాయికి తగ్గించింది. అదే సమయంలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న‌ 50 దేశాలకు మాత్రం నాలుగో స్థాయి సూచ‌న‌నే కొన‌సాగిస్తున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo