న్యూఢిల్లీ: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో వారాల తరబడి ట్రాకింగ్ చేసిన తర్వాత వెనెజువెలాకు సంబంధించిన రష్యన్ జెండాతో ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను అమెరికా బుధవారం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా, రష్యా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తగలవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ఆంక్షలు విధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాయత్తమవుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్టు చేసిన కొన్ని రోజులకే చమురు ట్యాంకర్ని అమెరికా స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అట్లాంటిక్ మహాసముద్రంలో చమురు ట్యాంకర్ రవాణాను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని రష్యా స్పష్టం చేసింది. ఇది అంతర్జాతీయ సముద్రయాన చట్టాన్ని ఉల్లంఘించడమేనని, నౌకాయాన స్వేచ్ఛను హరించడమేనని రష్యా స్పష్టం చేసింది. బెల్లా 1 అసలు పేరుతో బయల్దేరిన చమురు నౌక ఆ తర్వాత మరినేరాగా పేరు మార్చుకుని ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉన్నట్లు అమెరికా యూరోపియన్ కమాండ్ ఎక్స్ పోస్టులో తెలిపింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన నేరానికి ఫెడరల్ కోర్టు వారెంట్‌తో ఈ నౌకను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.