Air India | టాటా గ్రూప్ ఆధీనంలో నడుస్తున్న దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఈ సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి. తాజాగా అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వియన్నా (Vienna)లో నిలిపివేయాల్సి వచ్చింది.
డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన AI103 విమానం (Dreamliner flight) జులై 2న ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి బయల్దేరింది. మార్గం మధ్యలో ఇంధనం నింపుకునేందుకు వియన్నాలో ఆగింది. స్టాప్ఓవర్ సమయంలో సాధారణ తనిఖీల్లో నిర్వహణ సమస్య తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్తగా విమాన ప్రయాణాన్ని అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు అక్కడే హోటల్ వసతి కల్పించినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు విమానంలో సాంకేతిక సమస్య కారణంగా వాషింగ్టన్ నుంచి వియన్నా మీదుగా ఢిల్లీకి రావాల్సిన AI104 విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ సర్వీసును కూడా అధికారులు రద్దు చేశారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి వాపస్ అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
కాగా, గతనెల 12న డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరి విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 272 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read..
social media accounts | పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను మరోసారి బ్లాక్ చేసిన భారత్
Mohammed Shami | రూ.4లక్షలు చాలా తక్కువ.. కోర్టు తీర్పుపై షమీ మాజీ భార్య
Black Pepper | నల్ల మిరియాలతో ఇంటి చిట్కాలు.. ఏయే వ్యాధులకు వీటిని ఎలా ఉపయోగించాలంటే..?